Friday, January 28, 2011


పద్మ'అవార్డుల్లోనూ ప్రాంతీయ వివక్ష!

యథావిధిగా 62వ గణతంత్ర దినోత్సవం కూడా 'తెలంగాణ ప్రజల కు' నిరాశే మిగిల్చింది. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం (రాష్ట్రప తి) దేశానికి అత్యుత్తమ సేవలందించిన వారికి ప్రకటించే 'పద్మ' అవార్డుల్లోనూ తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోంది. 'తెలుగు పూదోటలో విరిసిన పద్మాలు', 'రాష్ట్రానికి 11 పద్మాలు' పేరిట పత్రికల్లో వార్తలు చోటు చేసుకున్నాయి.

కానీ అందులో ఆంధ్రప్రదేశ్ తరఫున ఎంతమంది నామినే ట్ అయ్యారు, ఎంత మంది ఎంపికయ్యారు అనే విశ్లేషణ చేసి ఉండాల్సిం ది. అవార్డుల ఎంపిక ప్రక్రియలోనే లోపం ఉంది. తెలంగాణపై ప్రత్యేక దృష్టితో పరిశీలన చేసినట్టయితే ఈ విషయాలు తేటతెల్లమవుతాయి. 'పద్మ విభూషణ్', 'పద్మభూషణ్', 'పద్మశ్రీ' ఈ మూడు అవార్డుల ఎంపికలో తెలంగాణకు అన్యాయం జరిగింది. 'పద్మ' అవార్డులను రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ప్రకటిస్తుంది. గత 54 యేండ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి ఎంపిక కమిటీల్లో ఎవరున్నారు. వారు ఎవరిని సూచించారు. ఆ సూచించిన వారిలో తెలంగాణ వాళ్లు ఎంత మంది ఉన్నారు అనే విషయాల్ని ప్రభుత్వం బహిరంగ పరచాలి.


తెలంగాణకు పద్మ అవార్డుల్లో అన్యాయం జరగడం ఇది మొదటిసారి కాదు. గత సంవత్సరం తెలంగాణ వారికి ఒక్కరికి కూడా ఈ అవార్డు దక్కలేదు. గత ఏడాది వై. వేణుగోపాల్‌రెడ్డి (పద్మ విభూషణ్), నూకల చిన సత్యనారాయణ (పద్మ భూషణ్), శోభరాజు, డాక్టర్ విజయప్రసాద్, సైనా నెహ్వాల్, అల్లూరి వెంకట సత్యనారాయణ రాజులకు పద్మశ్రీలు దక్కాయి. ఇందులో ఒక్కరంటే ఒక్కరు కూడా తెలంగాణకు ప్రతినిధులు కాదు.

ఇదే అన్యాయం ఈ సంవత్సరం కూడా కొనసాగింది. అక్కినేని నాగేశ్వరరావు, పల్లె రామారావులకు పద్మ విభూషణ్, రెడ్డి ల్యాబ్స్ అంజిరెడ్డి, నోవోపాన్ జివికె రెడ్డిలకు పద్మ భూషణ్‌లు దక్కాయి. అలాగే సిద్దిఖ్, వి.వి.ఎస్. లక్ష్మణ్ (ఆంధ్రా అతను హైదరాబాద్ క్రికెట్ జట్టు సభ్యుడు), గగన్ నారంగ్, పుల్లెల శ్రీరామచంద్రుడు, ప్రొఫెసర్ కోనేరు రామకృష్ణారావు, నారాయణ సింగ్ భాటి, గజం గోవర్ధన్‌లకు పద్మశ్రీలు దక్కాయి. అంటే ఈసారి రాష్ట్ర కోటాలో వచ్చిన 'పద్మ' అవార్డుల్లో ఒకే ఒక్కరు నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకకు చెందిన చేనేత కళాకారుడు గజం గోవర్ధన్ మాత్రమే తెలంగాణ బిడ్డ.

అంటే మొత్తం 11 అవార్డుల్లో ఒక్కరు మాత్రమే తెలంగాణకు చెందిన వాడు కాగా మిగతా పదిమంది సీమాంధ్ర ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నవారే. తెలుగు వారయినప్పటికీ తమిళనాడు కోటాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మభూషణ్, కర్నాటక నుంచి అనితారెడ్డికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. అలాగే హైదరాబాద్‌కు చెందిన సినీనటి టబూకు మహారాష్ట్ర కోటాలో పద్మశ్రీ అవార్డు లభించింది. తెలంగాణ ప్రతిభను ఇతర రాష్ట్రాల వారు గుర్తించినప్పటికీ 'ఆంధ్రప్రదేశ్' గుడ్డి సర్కారు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇది ఈనాటి తంతు కాదు. మొదటి నుంచీ ఉన్నదే.

ఆంధ్రప్రదేశ్ ఏర్పడినది మొదలు 'పద్మ' అవార్డుల్లో తెలంగాణ వారికి అన్యాయం జరుగుతూ ఉన్నదంటే అతిశయోక్తి కాదు. 1954లో జాకిర్ హుస్సేన్‌కు హైదరాబాద్ రాష్ట్రం నుంచి 'పద్మశ్రీ' అవార్డు దక్కగా ఆంధ్రప్రాంతం నుంచి మాచాని సోమప్పకు 'పద్మశ్రీ', పెండ్యాల సత్యనారాయణకు 'పద్మభూషణ్'లు దక్కాయి. 1955లో ఒక్క మాడపాటి హనుమంతరావుకే హైదరాబాద్ రాష్ట్రం నుంచి 'పద్మభూషణ్' దక్కింది.

మళ్లీ 1956లో నవాబ్ యార్‌జంగ్‌కు 'పద్మభూషణ్' దక్కింది. అంటే హైదరాబాద్ రాష్ట్రం లో తెలంగాణ ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతంతో పోల్చినప్పుడు ఎక్కువ అవార్డులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఈ 54 ఏళ్లలో దాదా పు 190 'పద్మ' అవార్డులు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారికి దక్కగా అందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు 30 మంది కూడా లేరంటే ఆశ్చర్యం కలుగుతుంది. రావి నారాయణరెడ్డి, హరీంధ్రనాథ్ ఛటోపాధ్యాయ మినహా రాజకీయ రంగంలో మరెవ్వరికీ ఈ అవార్డు దక్కలేదు. స్పోర్ట్స్‌లో అజహరుద్దీన్, ముఖేశ్‌కుమార్; సానియామీర్జాలు తప్ప ఇంకెవ్వరికీ ఈ అవార్డు సొంతం కాలేదు.

సి. నారాయణరెడ్డి, చెన్నమనేని హనుమంతరావు, కాళోజి నారాయణరావు, హరూన్ ఖాన్ షేర్వానీ, గులామ్ యజ్దానీ, అలియావర్ జంగ్, నేరెళ్ల వేణుమాధవ్, పద్మజానాయుడు, మెహదీ నవాజ్ జంగ్ లాంటి ప్రముఖులైన 20 మందికి మినహా తెలంగా ణ వారికి 'పద్మ' అదృష్టం దక్కలేదు. అదే ఆంధ్ర ప్రాంతానికి చెందిన సిని మా తారలు రామారావు, రేలంగి, చిరంజీవి, మోహన్‌బాబు, సాహిత్య రంగంలో కృష్ణశాస్త్రి, జాషువా, విశ్వనాథ, ఉప్పులూరి గణపతి శాస్త్రి, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌లకు రాజకీయ రంగంలో అయ్యదేవర కాళేశ్వరరావు, గొట్టిపాటి బ్రహ్మయ్య, సి.డి. దేశ్‌ముఖ్, కల్లూరు సుబ్బారావులకు ఇతర రంగాల్లో కాకర్ల సుబ్బారావు, ఎం.చలపతి రావు, తుర్లపాటి కుటుంబరావు, నార్ల తాతారావు తదితరులకు'పద్మ' అవార్డులు దక్కాయి.

పై వారితో సమానమైన అర్హతలు లేదా వారిని మించిన అర్హతలున్న తెలంగాణ వారికి 'పద్మ' అవార్డులు ఎందుకు రాలేదు అనేదే ప్రశ్న. నటనలో మోహన్‌బాబుకు సరితూగడా తెలంగాణకు చెందిన కాంతారావు. ఆయనకెందుకు ఈ అవార్డు రాలేదు? పోల్చడం కాదు గానీ తెలంగాణకు చెందిన ఒక్క చిందు ఎల్లమ్మకు గానీ, మిద్దెరాములుకు గానీ, చుక్క సత్తయ్యకు గానీ, చుక్కా రామయ్యకు గానీ, జాతీయ ఆచార్యులు బిరుదురాజు రామరాజు గానీ, ఆచార్య రవ్వా శ్రీహరికిగానీ ఈ అవార్డులు ఎందుకు దక్కలేదనేదే తెలంగాణవాదులను వేధిస్తున్న ప్రశ్న.

పీ.వీ. నరసింహారావు, బూర్గుల రామకృష్ణారావు, టి. అంజయ్య, పి. జనార్ధనరెడ్డి లాంటి చాలా మంది వ్యక్తులు ఈ అవార్డులకు అర్హులు. అయినా వారికెవరికీ ఈ 'పద్మా'లు దక్కలేదు. నిర్మల్, పెంబర్తి, చేర్యాల నక్కాషి, పోచంపల్లి టై అండ్ డై కళాకారులు, గోరటి వెంకన్న, అందెశ్రీ లాంటి కవి, గాయకులు, తోట వైకుంఠం, ఏలే లక్ష్మణ్ లాంటి ఆర్టిస్టులకు ఇంకా వివిధ రంగా ల్లో నిష్ణాతులైన వేలాది మంది ఈ 'పద్మ' అవార్డులకు కచ్చితంగా అర్హులే.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గానీ తెలంగాణ ప్రతిభకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించే అవకాశం లేదు. సీమాంధ్రుల వలసపాలనలో తెలంగాణ కళలపై, కళాకారులపై, ప్రతిభపై చిన్న చూపు నిరంతరంగా కొనసాగుతుంది. ప్రత్యేక రాష్ట్రంలో తప్ప తెలంగాణ కళలకు, కవులకు, సాహిత్యానికి, సాహితీవేత్తలకు, స్థానిక ప్రతిభకు గుర్తింపు దక్కదు. కాబట్టే తెలంగాణ ప్రజలందరూ అందుకోసం ఉద్యమిస్తున్నారు.

సంగిశెట్టి శ్రీనివాస్

No comments: