తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో రెండో దశ కూడా
పూర్తయినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేబినెట్ నోట్
సిద్ధమైంది. దానికి యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ ఆమోదం లభించాల్సి ఉంది.
ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉన్నారు. ఆమె తిరిగి రాగానే దాన్ని ఆమె ముందు
పెట్టి రాజకీయ ఆమోదం పొందుతారని సమాచారం. ఆమె ఆమోదం లభించిన వెంటనే నోట్‌ను
కేంద్ర మంత్రివర్గానికి పంపిస్తారని సమాచారం.
ఈ మేరకు ఆదివారం పీటీఐ వార్తా సంస్థ ఓ కథనాన్ని వెలువరించింది. కేంద్ర హోం
మంత్రి సుశీల్‌కుమార్ షిండే ఆదేశాల మేరకు ఆ శాఖ అధికారులు రాజ్యాంగ
విధివిధానాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన కేబినెట్ నోట్
రూపకల్పనను ఇప్పటికే పూర్తి చేశారని, ఇక దానికి రాజకీయ ఆమోదమే తరువాయని
పిటిఐ వార్తాకథనం తెలిపింది..
తెలంగాణ నోట్ రెడీ: సోనియా కోసం వెయిట్
"కేబినెట్ నోట్‌ను మేం సిద్ధం చేసేశాం. రాజకీయ ఆమోదం కోసం ఎదురు
చూస్తున్నాం'' అని హోం శాఖ సీనియర్ అధికారి ఒకరు అన్నట్లు పీటీఐ తెలిపింది.
వైద్య చికిత్సల నిమిత్తం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈనెల రెండో
తేదీన అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఏడెనిమిది రోజుల్లో ఆమె తిరిగి
వస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది చెప్పారు. ఆమె
రాగానే అది ముందుకు కదులుతుందని సమాచారం.
వాస్తవానికి కేబినెట్ నోట్ సిద్ధమైన తర్వాత దానిని న్యాయశాఖ పరిశీలనకు
పంపించాలి. అయితే, సోనియా ఆమోద ముద్ర పడిన తర్వాతే దానిని న్యాయ శాఖకు
పంపించాలని హోంశాఖ అధికారులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజించి,
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ
(సీడబ్ల్యూసీ) నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై తీర్మానాన్ని సిద్ధం
చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇందులో భాగంగానే కేంద్ర హోం శాఖ
కేబినెట్ నోట్‌ను సిద్ధం చేసింది.
నోట్ తయారవుతోందని, ఇందుకు 20 రోజులో.. 30 రోజులో ఎన్నిరోజులు పడుతుందో
చెప్పలేనని సుశీల్ కుమార్ షిండే ఇటీవల మీడియా ప్రతినిధుల సమావేశంలో
వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆంటోనీ కమిటీ సిఫారసులను కూడా పరిగణనలోకి
తీసుకుని కేబినెట్ నోట్‌ను తయారు చేస్తామని కూడా ఆయన చెప్పారు. అయితే,
ఆంటోనీ కమిటీ ఇంకా నివేదిక ఇవ్వకముందే కేబినెట్ నోట్ సిద్ధమైపోయిందని ఆ
శాఖ వర్గాలు తెలపడం విశేషం.
కాగా, కేబినెట్ నోట్‌పై కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేయగానే
ఆంధ్రప్రదేశ్ విభజనతో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి మంత్రుల సంఘాన్ని
ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఆమోదానికి పంపుతారు.
No comments:
Post a Comment