Monday, September 9, 2013

తెలంగాణ నేతలు చంద్రబాబుకు షాక్ ఇస్తారా?

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీమాంధ్రలో చేస్తున్న తెలుగువాడి ఆత్మగౌరవ యాత్ర పార్టీలో తీవ్ర పరిణామాలకు దారి తీసే ప్రమాదం కనిపిస్తోంది. చంద్రబాబు సమైక్యాంధ్రకు అనుకూలంగా మాట్లుడుతుండడంతో తెలంగాణ నేతలు ఇరకాటంలో పడ్డారని చెబుతున్నారు. తెలంగాణ నేతలు చాలా మంది పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్నట్లు గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్నాం, ఈసారి తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని భావిస్తున్న ఎమ్మెల్యేలు కొందరు ఇతర పార్టీల వైపు చూస్తున్నారని అంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్, టిఆర్‌ఎస్‌ల వైపు చూస్తున్ననట్లు చెబుతున్నారు. అయితే వెంటనే వారు పార్టీలు మారేందుకు సిద్ధంగా లేరని, విభజన అంశంపై కేంద్రం తీసుకునే చర్యలను బట్టి నిర్ణయాలు ఉంటాయని టిడిపి సీనియర్ నాయకుడొకరు తెలిపారు. తమ నియోజక వర్గాల్లో కాంగ్రెస్, తెరాస నుంచి బలమైన నాయకులు లేని ప్రాంతాల్లో ఆ పార్టీల వైపు తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు ఆసక్తి చూపుతున్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, తాను పార్టీని వీడే ప్రసక్తి లేదని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు రమేష్ రాథోడ్ తెలిపారు. రాష్ట్ర విభజనతో టిడిపి జాతీయ పార్టీ అవుతుందని, రెండు ప్రాంతాల్లోనూ ఉంటుందని తెలిపారు. అయితే, చాలా మంది నాయకులు కాంగ్రెసు, తెరాస వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. విభజన ప్రక్రియ త్వరగా పూర్తి చేస్తే బాగుండేదని, కానీ కాంగ్రెస్ మాత్రం తమ పార్టీని దెబ్బ తీయాలని ఉద్దేశ పూర్వకంగానే జాప్యం చేస్తోందని టిడిపి నాయకులు అనుమానిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో తాము వౌనంగా ఉండాల్సి రావడం, మరోవైపు చంద్రబాబు తెలంగాణను అడ్డుకున్నానని సీమాంధ్రలో ప్రచారం చేస్తుండడం తమకు ఇబ్బంది కలిగించే విషయాలే అని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఒకటి రెండు నెలల్లో విభజన అంశం ఒక కొలిక్కి వస్తే అప్పటి పరిస్థితిని బట్టి కొంతమంది పార్టీ మారే అవకాశం లేకపోలేదని తెలంగాణకు చెందిన టిడిపి నాయకులు చెబుతున్నారు. టిఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అవుతుందా? లేక పొత్తు పెట్టుకుంటుందా? అనే విషయం తేలాలని, విలీనం అయితే కొంతలో కొంత టిడిపి పరిస్థితి మెరుగు పడుతుందని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే బలమైన ప్రతిపక్షంగా టిడిపి నిలుస్తుందని టిడిపి ఎమ్మెల్యేలు అంటున్నారు.

No comments: